Srimad Valmiki Ramayanam

Balakanda Chapter 25

' Story of Tataki -2 !'

With Sanskrit text in Telugu , Kannada and Devanagari,

బాలకాండ
ఇరువది ఇదవసర్గము
( తాటక వృత్తాంతము)

అథ తస్యాప్రమేయస్య మునేర్వచనముత్తమమ్ |
శ్రుత్వా పురుషశార్దూలః ప్రత్యువాచ శుభాం గిరమ్||

తా|| అప్పుడు అప్రమేయుడైన ఆ మునియొక్క ఉత్తమమైన వచనములను వినిన పురుష శార్దూలమైన ఆ శ్రీరాముడు సముచిత రీతిలో ఇట్లు అడిగెను.

అల్పవీరా యదా యక్షాః శ్రూయంతే మునిపుంగవ |
కథం నాగసహస్రస్య ధారయత్యబలాబలమ్ ||

తా|| 'ఓ మునిపుంగవా ! యక్షులు అల్పవీరులు అని వినబడడమైనది. అందువలన అబల అయిన ఆమె ఎట్లు వేయిఏనుగుల బలము కలిగియున్నది?' అని '

ఇత్యుక్తం వచనం శ్రుత్వా రాఘవస్యామితౌజసః |
హర్షయన్ శ్లక్షయా వాచా స లక్ష్మణమరిందమమ్ ||
విశ్వామిత్రోs బ్రవీద్వాక్యం శృణు యేన బలోత్తరా |
వరదానకృతం వీర్యం ధారయత్యబలాబలమ్ ||
పూర్వమాసీన్మహాయక్షః సుకేతుర్నామ వీర్యవాన్ |
అనపత్యః శుభాచారః స చ తేపే మహత్ తపః ||

తా|| అమిత తేజోవంతుడగు ఆ రాఘవుడు చెప్పిన ఈ వచనములను విని సంతోషముతో విశ్వామిత్రుడు శత్రువులను నాశనమొనర్చు రాఘవునితో ఇట్లు పలికెను.' రామా ! ఆ అబల అంత బలవంతురాలగుటకు కారణము వినుము. ఆమె వర ప్రభావమున వేయి ఏనుగుల బలము పొందినది. పూర్వము 'సుకేతు'డను ఒక మహాయక్షుడు ఉండెను. అతడు గొప్ప ప్రతిభావంతుడు, సత్ప్రవర్తన గలవాడు. సంతానములేనివాడు కనుక అతడు తీవ్రమైన తపస్సుని ఆచరించెను.

పితామహస్తు సుప్రీతః తస్య యక్ష పతేస్తదా |
కన్యారత్నం దదౌ రామ తాటకాంనామ నామతః ||
దదౌ నాగ సహస్రస్య బలం చాస్యాః పితామహః |
న త్వేన పుత్త్రంయక్షాయ దదౌ బ్రహ్మా మహాయశాః ||

తా|| అతని తపస్సునకు సంతుష్టుడైన బ్రహ్మ అ సుకేతునకు ఒక కన్యారత్నము ప్రసాదించెను. ఆమె పేరు తాటకి. ఆ కన్యారత్నమునకు వేయి ఏనుగుల బలము ప్రసాదించెను కాని ఆ యక్షునకు పుత్త్రుని అనుగ్రహింపలేదు.''

తాం తు జాతాం వివర్ధంతీం రూపయౌవ్వన శాలినీమ్ |
జంభపుత్రాయ మందాయ దదౌ భార్యాం యశస్వినీమ్ ||
కస్యచిత్త్వథకాలస్య యక్షీపుత్రం అజాయత |
మారీచం నామ దుర్దర్షం యశ్శాసాద్రాక్షసోsభవత్ ||

తా|| అట్లు జన్మించిన ఆ తాటకి పెరిగి పెద్దదై చక్కని రూపశోభలతో విలసిల్లెను. యశస్విని అగు ఆమెను జంభాసురుని పుత్రుడైన సుందునకు భార్యగా ఇచ్చెను. కొంతకాలము తరువాత ఆమె ఒక కుమారుని గనెను. అతని పేరు మారీచుడు. అతడు ఎదిరింప శక్యము గానివాడు. కాని శాపమువలన రాక్షసుడయ్యెను.

సుందే తు నిహతే రామ సాsగస్త్యమ్ ఋషిసత్తమమ్ |
తాటకా సహపుత్త్రేణ ప్రధర్షయితుమిచ్ఛతి ||
భక్షార్థం జాత సంరంభా గర్జంతీ సాభ్యధావత |
అపతంతీంతు తాం దృష్ట్వా అగస్త్యో భగవాన్ ఋషిః ||
రాక్షసత్వం భజస్వేతి మారీచం వ్యజహార సః |
అగస్త్యః పరమక్రుద్ధః తాటకామపి శప్తవాన్ ||
పురుషాది మహాయక్షీ విరూపా వికృతాననా |
ఇదం రూపం విహాయాథ దారుణం రూపమస్తుతే ||

తా|| 'ఓ రామా! సుందుడు ఋషి సత్తముడగు అగస్త్యునివలన మృతిచెందెను. అప్పుడు ఆ తాటక పుత్త్రునితో కూడి అ మహామునిని చంపుటకు పూనుకొనెను. క్రుద్దురాలై ఆయనను భక్షించుటకు గర్జించుచూ ముందుకు ఉరికెను. అగస్త్యమహాముని మారీచునిని, " నీవు రాక్షసత్వము పొందువుగాక " అని శపించెను. పరమ క్రుద్ధుడైన ఆగస్త్యమహాముని తాటకిని కూడా శపించెను. "ఓ తాటకీ నీకు ఈ రూపము పోయి వికృతరూపముతో వికృత మైన ముఖముతో నరమాంస బక్షకురాలివి అగుము" అని'.

సైషా శాపకృతా మర్షాతాటకా క్రోధమూర్చ్ఛితా |
దేశం ఉత్సాదయత్యేనమ్ అగస్త్య చరితం శుభమ్||
ఏనాం రాఘవ దుర్వృత్తాం యక్షీం పరమ దారుణీమ్ |
గోబ్రాహ్మణ హితార్థాయ జహి దుష్టపరాక్రమామ్ ||
న హ్యేనాం శాపసంస్పృష్టాం కశ్చిదుత్సహతే పుమాన్ |
నిహంతుం త్రిషు లోకేషు త్వాం ఋతే రఘునందన ||

తా|| 'అట్లు అగస్త్యుని శాపగ్రస్తురాలైన తాటకి, అ శాపమునకు తట్టుకొనలేక క్రోధముతో జలించెను. ఆ కారణముగా ఆగస్త్యుడు తిరిగిన ఈ ప్రదేశమును అంతయూ ధ్వంసమొనర్చుచున్నది. కనుక ఓ రాఘవా! దుష్ప్రవర్తన గలదియూ, మిక్కిలి భయంకరమైనదియూ, దుష్టమైన పరాక్రమము గలదియూ అయిన తాటకిని గో బ్రాహ్మణ హితము కొఱకు వధింపుము. ఓ రఘునందనా శాపమునకు గురి అయిన తాటకిని వధించుటకు నీవు తప్ప ముల్లోకములలో ఇంకెవరునూ సమర్థులుగారు'.

న హి తే స్త్రీవథకృతే ఘృణా కార్యా నరోత్తమ |
చాతుర్వర్ణ హితార్థాయ కర్తవ్యం రాజసూనువా ||
నృశంసమనృశంసం వా ప్రజారక్షణ కారణాత్ |
పాతకం వా సదోషం వా కర్తవ్యం రక్షతా సతా ||
రాజ్యభారనియుక్తానామ్ ఏషధర్మః సనాతనః |
అధర్మ్యాం జహి కాకుత్ స్థ ధర్మో హ్యస్యా న విద్యతే ||

తా|| ' ఓ నరోత్తమా ! స్త్రీని చంపుట ఎట్లు అని ఆమెపై కనికరము చూపవద్దు. నాలుగు వర్ణములవారికి మేలు కూర్చుట రాజకుమారుని కర్తవ్యము. ప్రజలహితము కొఱకు చేయు కార్యము అది కౄరమైనదా తద్భిన్నమైనదా అని చూడరాదు. పాతకమైననూ దోషములతో కూడినదైననూ దానిని అవశ్యముగా ఆచరింపవలసినదే. రాజ్యభారము మోయువారికి ఇది విద్యుక్త ధర్మము. కనుక ఓ కకుత్స్థా ! అధర్మమునకు ఒడి గట్టిన ఈ తాటకిని వధింపుము. ఈమె చేయు పనులలో 'ధర్మము' అన్న మాటకు స్థానము లేదు'.

శ్రూయతే హి పురా శక్రో విరోచనసుతాం నృప |
పృథివీంహంతు మిచ్ఛంతీం మంథరాభ్యసూదయత్||
విష్ణునాపి పురా రామ భృగుపత్నీ ధృడవ్రతా |
అనింద్రం లోకమిచ్ఛంతీ కావ్యమాతా నిషూదితా ||

తా||'ఓ రామా! పూర్వము విరోచనుని సుత అయిన మంథర అను నామె భూదేవిని చంపుటకు పూనగా, అప్పుడు ఇంద్రుడు ఆమెను చంపెనని వింటిమి. పూర్వము భృగుపత్నియూ శుక్రాచార్యుని తల్లియూ ఇన ఆమె ఇంద్రాది దేవతలను సంహరించుటకు ధృడవ్రతమును చేపట్టగా విష్ణువు ఆమెను చంపెను'.

ఏతైశ్చాన్యైశ్చ బహుభిః రాజపుత్త్ర మహాత్మభిః |
అధర్మసహితా నారో హతాః పురుషసత్తమైః |
తస్మాదేవానాం ఘృణాం త్యక్తా జహి మచ్ఛాసనానృప||

తా|| 'ఓ రాజకుమారా ! ఈ విధముగా చాలామంది మహానుభావులు అధర్మములకు ఒడి గట్టిన స్త్రీలను వధించిరి . కావున ఓ రామా! కనికరము చూపక నామాటను పాలించి దుర్మార్గురాలైన తాటకిని వధింపుము.' అని.

ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే బాలకాండే పంచవింశ స్సర్గః ||
సమాప్తం ||


|| om tat sat ||